Articles

నా నియోజకవర్గ ప్రజలకు సందేశం

Date: 21st October 2018

ఈ సభ లో మీరు ఉన్నారు అంటే మీరు మంచి సాంగత్యం లో ఉన్నట్టే. మీకు ఎవరు ఎటువంటి డబ్బు, మందు ప్రలోభం చూపలేదు. స్వచ్చందంగా మీరే ఒక రాజకీయ మార్పు కోరుతూ, ఒక కొత్త వ్యక్తి చెపుతున్న విషయాలు నచ్చి, నన్ను ఒక సారి పరీక్షించడానికి ఇక్కడికి వచ్చారు, నేను చెప్పింది నిజమేనా?

నేను మీకు ఉపన్యాసాలు ఇవ్వడానికి రాలేదు, మీకు ఏది తప్పో ఏది సరైందో చెప్ప డానికి రాలేదు. నొక్కేయ పడుతోన్న మీ గొంతుకులకు ఒక వాణి లా వచ్చాను, హరించ పడుతోన్న మీ హక్కులకు ఒక కవచమ్ లా వచ్చాను, ఒక మంచి ప్రత్యామ్న్యాయం లేక వాపోతున్న ఎన్నికల్లోకి, ఒక ఆశాచిహ్నం లా వచ్చాను.

ప్రజాస్వామ్యంలో మర్యాద పూర్వకంగా, ఎటువంటి దుర్భాషలు ఆడకుండా ఎటువంటి వ్యక్తిగత దూషణ చేయకుండా అసమ్మతి తెలియ చేయ కలగాలి. సివిలిటీ మైంటైన్ చేయ కలగాలి. పరస్పర గౌరవ మర్యాదలు నిలుపుకోగలగాలి. ఇది చాలా ముఖ్యం.

లీడర్ అంటే ప్రజలకు కొన్ని సార్లు కఠినమైన నిజాలు చెప్పాల్సి ఉంటుంది. ఎప్పుడు చూసినం మనం ఈళ్ళ నుంచి అవసరమైన కాలం ల ధైర్యం, ఎప్పుడు విన్నాం మనం ఈళ్ళ నుంచి అతిముఖ్యమైన సమయం ల అవసరమైన నిజం.

వీళ్ళ మేనిఫెస్టోలు వింటుంటే… మతి పోతుంది, ఈ కథలకు ముగింపు పలకాలంటే ఒక విధానం ఉంది. వీళ్ళు ఖర్చుచేస్తాం అని చెపుతున్న ప్రతి రూపాయికి ఎక్కడి నుంచి ఆదాయం వస్తుందో చెప్పాకే వారు ఈ పథకాలు ప్రకటించాలి.

ఈ సంవత్సరం లెక్కలు ఒక సారి చూద్దాం. Official figures. RTI information. బడ్జెట్ 174000 కోట్లు, 88 వేల కోట్లు రాబడి, నిర్వహణ వ్యయం 70 వేల కోట్లు. అంటే మిగిలింది 18 వేల కోట్లు. 18 వేల కోట్ల తో లక్ష కోట్లు ఎలా ఖర్చు చేస్తారు.

అప్పు చేసేవాడే నాయకుడా? …

ఏ ఒక్కరు నిజమైన రాజకీయాలు చెయ్యట్లేదు, రాజకీయం ముసుగు లో మనుషుల జీవితాలతో వ్యాపారాలు చేస్తున్నారు. ఇదేమన్నా సంత నా, నువ్వెంతకు అమ్ముడు పోతావు అంటే నువ్వెంతకు అమ్ముడు పోతావు అనడానికి. వీళ్ళా మనల్ని గట్టెకించేది.

నిజమైన రాజకీయం అంటే ఏంటో చూపిస్తా.

రాజకీయం అంటే ప్రజలను ఉద్దరించేది, దిగజార్చేది కాదు. రాజకీయం అంటే ప్రజలను బలవంతులను చేసేది, బలహీనులను కాదు. రాజకీయం అంటే ప్రజలను స్వతంత్రులను చేసేది, బానిసలను కాదు. మనం రాజకీయం చేస్తే ప్రజల్లోని ఆత్మ విశ్వాసం పెరగాలి, తమ కాళ్ళ మీద తాము నించునే గుండె ధైర్యం ప్రజల్లో తేవాలి. ఇది రాజకీయం అంటే, నేను చూపిస్తా వీళ్ళకి...

ఇక పథకాల్లోకి వెలితే రైతుబంధు, ఈ పథకం వల్ల 13000 వేల కోట్లు సంవత్సరానికి మనమీద భారం. దాని వల్ల ఉపయోగం ఎమన్నా ఉందా అంటే, మీరే ఊర్ల పొంటి పోయి అడుగుర్రి, నిజంగా, ఎకరానికి నాలుగు వేలు ఎంత దూరం పోతున్నాయో.

ఇక రైతుభీమా, ప్రజలను ఎన్ని విధాలుగా విడగొట్టాల్నో అన్ని విధాలుగా విడగొట్టేస్తుర్రు. దీనికి అంచనా 1000 కోట్లు. ఏ, వేరే వృత్తుల్లోని ప్రజలు చనిపోతే ఆళ్ళ కుటుంబాలు రోడ్డున పడవా? ఏందీ పక్షపాత ధోరణి, అసలు భీమా వ్యాపారంతో మీకు ఏంది పని.

డబ్బులు పంచారు అనే కారణం ఓటు వేయడానికి ముమ్మాటికీ సరైంది కాదు. ఈ అభ్యర్థి సీఎం అయితడు అనేది మాత్రమే ఓటు వేయడానికి కారణం కాకూడదు. సరే ఒక సారి అవకాశం ఇచ్చి 4 యేండ్లు పాలన చూసినంక కుడా అదే నిర్ణయం తీసుకుంటే మాత్రం అది తప్పే అవుతుంది.

తప్పుడు కారణాలకు ఓట్లు వేస్తే తప్పులు చేసే వారే ఎన్నిక అవుతారు. ప్రజాస్వామ్యం లో మర్యాద పూర్వకంగా, ఎటువంటి దుర్భాషలు ఆడకుండా ఎటువంటి వ్యక్తిగత దూషణ చేయకుండా అసమ్మతి తెలియ చేయ కలగాలి. సివిలిటీ మైంటైన్ చేయ కలగాలి. పరస్పర గౌరవ మర్యాదలు నిలుపుకోగలగాలి.

అందుకే నేను ఏ వాదన చేసిన స్పష్టమైన ఉదాహారణలతో వాస్తవిక పరిస్థితులు చూపి ప్రజలకు నా యొక్క వాదన వినిపిస్తాను.

ప్రజల్లోకి వెళ్లి నేను కుడా అభిప్రాయ సేకరణ చేసాను. ఓ, ఎక్కడ చూడు డెవలప్మెంట్ అని ప్రజలు అంటుంటె ఆ డెవలప్మెంట్ కొరకు వారు కడుతున్న ఖరీదును చూడలేని ప్రజలను చూసి నేను ఆశ్చర్యపోయాను. మన సమాజం యొక్క ప్రమాణాలు ఎంత దిగజారి పోయాయో కళ్లారా చూసి చెలించిపోయాను. రెండు రేండ్ల నాలుగు అని గ్రహించలేని స్థాయికి మనం పడిపోయాం.

నాలుగు సంవత్సరాల క్రింద మన సగటు ఆదాయం ఎంత అప్పట్లో ఇక్కడ ఒక గజం భూమి ఎంత? ఇక ఇప్పుడు మన సగటు ఆదాయం ఎంత ఇప్పుడు ఇక్కడ గజం భూమి ఎంత. ఈడ కొనుడు ఎమన్నా ఉందా, అమ్ముకునుడేనా?ఎకరాలు అమ్మి గజాలు కొనుక్కుంట అభివృద్ధి అంటే ఎట్ల నమ్ముడు.

ఈ ప్రభుత్వం చేప్పట్టిన పనుల వల్ల, ప్రత్యక్షంగా మన కొనుగోలు శక్తికి గండి పడింది. ఈ ప్రభుత్వం చేస్తున్న అప్పుల వల్ల ఈనాడు మన ఆర్థిక పరిస్థితి బాగా క్షీణించి పోయింది. మనకు ఖర్చులు వస్తాయి పైసలు ఇంకెవరికో పోతాయి. మన ఆదాయం కంటే ఖర్చు ఎన్నో రెట్లు పెరిగింది. అప్పులు చేస్తేనే అభివృద్ధి జరుగుతుంది అనుకోవడం వాళ్ళు మనల్ని మోసం చేయడానికి చెబుతున్న అవాస్తవాలు. అది వీళ్ళ అసమర్ధత కు అద్దం పడుతుంది.

డబ్బులు పంచారు అనే కారణం ఓటు వేయడానికి ముమ్మాటికీ సరైంది కాదు. ఇంత మంది తప్పుడు నాయకులు మన మధ్య విచ్చలవిడిగా తిరుగగలుగు తున్నారంటే మనం ఓటు వేయడం వెనక ఉన్న తప్పుడు కారణాలే ఏకైక కారణం.

ఇదేంటి అని ప్రశ్నిస్తే , ప్రశ్న కు ప్రశ్నే సమాధానం గా వాక్చాతుర్యాన్ని ప్రదర్శిస్తారు కానీ అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం ఇవ్వలేరు. ఇలాంటి నాయకులు అమాయకులా, అసమర్థులా, అమ్ముడుపోయారా.

ఇక అప్పుల విషయానికి వస్తే … అప్పుల గురించి మాకెందుకు , మేమేమన్న తీర్పేదుందా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. విపరీతంగా పెరిగిపోతున్న పెట్రోల్ డీజిల్ ధరలు దీనికి నిర్వివాదమైన నిలువెత్తు నిదర్శనం. ఒక ప్రాథమిక అవసరంగా మారిపోయిన ఇంధనం పై అడ్డగోలు గా వంద శాతం కంటే ఎక్కువ పన్నులు వేసి ప్రజలను పీడిస్తునారు. మితిమీరిన అప్పులకు వడ్డీలు కట్టాలంటే పన్నులు వేయాల్సిందే అని సమర్థించుకుంటున్నారు.

పది రూపాయలు అప్పు చేసి, ప్రజలకు ఒక చారాణా ముష్టి పారేసి, తొమ్మిది భారానా దళారులు దోస్కతింటుర్రు. ఇయాల బయట ఎక్కడైనా చారాణా చెల్లుతదా , మన బ్రతుకులు కుడా అంతే బయట చెల్లవు. లేబర్ ఖర్చులు, వస్తువుల ధరలు సేవల ధరలు, ఇండ్ల ధరలు భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇదేం పాలన.

అయినా సరే ప్రజలు వీరి వెనక పోయారంటే కారణం వారికి వీరంటే ఇష్టం ఉండి కాదు ఇంకో మంచి ప్రత్యామ్న్యాయం లేక. ఈ పరిస్థితిని, మన దేశ దుస్థితిని మార్చాల్సిన సమయం ఆస్సన్నమైంది. నేనే ప్రత్యామ్న్యాయం గా వస్తున్నా.

నా మానిఫెస్టోని జాగ్రత్త గా పరిశీలించండి, దాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రజలపై పడే భారం ఎంతో పరీక్షించండి ఆ తర్వాత మీకు సమంజసంగా అనిపిస్తేనే ఓటు వేయండి కానీ దయచేసి గుడ్డిగా మాత్రం ఓటు వేయకండి. అలా చేస్తే మనం, భావితరాలకు అన్యాయం చేసిన వాళ్ళం అవుతాము. ఈ కనీస భాద్యత మనపైనే ఉంది.

ఇక నా ప్రత్యర్థుల విషయానికి వస్తే, వీరిని ఓడించకపోతే వీరి పోకడను మనం సమర్థించినట్టే దీన్ని మనం పట్టించుకోక పోవడం అంటే ఇలాంటి దిగజారిన రాజకీయ శైలిని మనం ప్రోత్సహించినట్టే.

ఈ మూస ధోరణి, ఈ రూఢి వాదం, ఈ భికారీల మనస్తత్వం మనకు పుట్టుకతో రాదు.

అధికారం లో ఉన్నవారు సమాజాన్ని విడగొట్టి బలహీనం చేయడానికి ఇలాంటి దిగజారుడు ప్రవర్తన మనకు అలవాటు చేస్తారు. మన దేశంలో మనమే సంపూర్ణస్థాయిలో అడుక్కునేలాగా చేస్తున్నారు. మన స్థాయిని దినదినానికి దిగజార్చి మన వ్యక్తిగత గౌరవ మర్యాదలను మంటకలుపుతున్నారు.

అబి బస్, బహుత్ హోగయా, ఇక వీళ్ళ పప్పులు ఉడకవు.

నిజాన్ని తక్కువ అంచనా వేయకండి, నా పక్షాన నిజం ఉంది.

సమాజమే బలం దేశమే బలం ఐకమత్యమే మహాబలం!
జై హింద్

My Website: www.paree.in
My Email: www.paree.in@gmail.com

Watch the Full Video below.