Articles

రాజకీయ పార్టీల్లోనే సమస్య

Date: 11th October 2018

వీళ్లకి అప్పులు చేయడం తప్ప ఇంకో పని లేదా, రాదా, తెల్వదా, చేతకాదా!
నాకు అర్థంకాక అడుగుతున్న, ఎవడు భై మిమ్మల్ని అన్ని ఉచితంగా ఇయ్యమంటున్నోడు. ఒకసారి నాకు చెప్పుర్రి. అరె, మేము మిమ్మల్ని ఖరాబ్ చేస్తున్నామా మీరు మమ్మల్ని ఖరాబ్ చేస్తుర్రా.

పార్టీ రాజకీయాల గురించి మాట్లాడుకుందాం... పాలనకు పార్టీలకు ఏంది సంబంధం. పార్టీలకు అతీతంగా మనం సంఘటితం కాలేమా?! మనలోని సంఘటిత శక్తి అంత బలహీనమైపోయిందా. పార్టీల్లో కూడా మనమేకదా ఉంది.

పార్టీల్లోని చిన్నస్థాయి కార్యకర్తలకు ఇదే నా విన్నపం. బీర్లకు, బిర్యానీలకు, చిల్లర నోట్లకు అమ్ముడుపోకండి. మిమ్మల్ని నమ్మి ఓటు వేసేవారిని మోసం చేయకండి. ఏదో సాధించడానికే రాజకీయాల్లోకి వచ్చి ఉంటారు కదా, మరి ఎందుకు ఆత్మవంచన చేసుకుంటున్నారు. తప్పేందో సరైందేదో తేల్చుకునే పరిజ్ఞానం ఉందా లేదా. మనల్ని నమ్మిన వారిని కాపాడే భాద్యత మనపైవుంటుంది. మనమంతా పార్టీలకు అతీతంగా స్వతంత్రంగా ఆలోచించడం మొదలు పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. కాంగ్రెస్ కానీ, తెరాస కానీ, భాజపా కానీ, తెదేపా కానీ, నిజానికి మనం పార్టీలను పట్టుకుని వేలాడాల్సిన పనేంటి.

ఒకడు మనల్ని మోసం చేసాడని ఇంకో అభ్యర్థికి ఓటు వేసి గెలిపిస్తే, మళ్ళీ ఈ కొత్త నాయకులు అటు పక్షానికే అమ్ముడుపోతే ఇది హాస్యాస్పదమా లేక మన ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క దౌర్భాగ్యమా.

ఒక పక్క భూములు గుంజుకొని బిచ్చం పడేస్తుంటే దిక్కు తోచక, చూస్తూ తట్టుకోలేక కనీసం ఎన్నికల్లోనైనా వారిని ఆపుదామంటే ఆ-పరేషన్ ఆకర్షణ జీ-పరేషాన్ ప్రలోభనా పెట్టి విపక్షాలను కోరినంత డబ్బు కుమ్మరించి కోనేస్తుంటే మనం ఏంచేస్తునం!

ఒక పక్క ఆదాయం తగ్గుతుంటే, ఇంకో పక్క ఖర్చులు భరించలేకపోతుంటే... వీళ్ళు మనమీద ఇంకా పన్నుల భారం పెంచుకుంటూ పోతున్నారు. ఈ విషవలయం నుండి బయటపడాలంటే ఈ పార్టీల ఉచ్చు నుండి తప్పించు కోవాలంటే మనం పార్టీలకు అతీతంగా సంఘటితం కావాల్సిందే.

ఇక ధరలపెరుగుదలకు వస్తే ... ఇంత విపరీతంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం దాని పట్ల ఒక మాట కూడా మాట్లాడకపోతే ఏందనట్టు?! 33 శాతం పెట్రోల్ మీద స్టేట్ వ్యాట్. ఆడ కేంద్రం కాస్త తగ్గించి ఈడ రాష్ట్రాలు కూడా తగ్గిస్తాయేమో అంటే ఇల్లేమో శాసనసభ రద్దు చేసి కుసుర్రు. ధరలు పెరుగుతుంటే ప్రభుత్వం పని చేసి వాటిని తగ్గియాల్నా శాసనసభ రద్దుచేసుకుట్ట పోవాల్నా. ఇదేం పాలన. మన దేశంల మనం బతకనికే వీళ్లకు లైఫ్ టాక్స్ కట్టాల్నా. అసలు ఎందిది!

జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ పోరాటం పార్టీల మధ్య కానేకాదు. ప్రజలకు పార్టీలకు మధ్య జరుగుతున్న ఒక కనిపించని పోరాటం. పార్టీల కండ బలానికి ప్రజల బలహీనతకు మధ్య జరుగుతున్న నిరంతర పోరాటం. మనలో మనకు వర్గాల పేరిట కులాల పేరిట మతాల పేరిట జాతి పేరిట పాతుకు పోయిన విభేదాలతో మనం నిర్వీర్యం కాక బలోపేతం అవుతామా.

పార్టీలు మారని నాయకులు మనకు నేడు కనిపిస్తే అది ఆశ్చర్యమే. ఏందీ నాటకాలు. నిన్ననే తిట్టుకొని రేపు మెచ్చుకుంటుంటే ప్రజలు పిచ్చోళ్లు అయిపోతుర్రు. తండ్రి దండాలు పెడుతుంటాడు కొడుకు బూతులు తిడుతుంటాడు, ఏందిది. ఇక్కడ రెండు వేరు వేరు విషయాలు జరుగుతున్నాయి. ఒకటి వాస్తవం, రెండు నాటకం. నాటకాలు చూసి మోసపోదామా లేక వాస్తవాలు గ్రహించి సంఘటితం అవుదామా. నిర్ణయం మీదే.

నిజ జీవితంలో మీరు అనుభవిస్తున్న దుర్భరమైన తీవ్ర పరిణామాలు మీ వాస్తవాలు.

ప్రజల వ్యక్తిగత జీవితాల్లో అప్పులు ఎన్ని, ఆదాయం ఎంత. నానా కష్టాలు పడుతున్నా ఖర్చులు ఎల్లక కృంగిపోయిన ఒక పౌరిడి మీద పెట్రోల్ డీజిల్ పై 100% లైఫ్ టాక్స్ కడుతుంటే... ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కాపాడాల్సిన నాయకులు ప్రజలను ఆదుకోవాల్సింది పోయి స్వప్రయోజనాలు ఆశించి చట్ట సభలను ఇష్టానుసారంగా రద్దు చేసిన తీరు చూస్తుంటే... ప్రస్తుత పాలకులకు ప్రజల వాస్తవాల పట్ల ఏమాత్రం అవగాహనా కానీ పట్టింపు కానీ లేవని స్పష్టమవుతుంది.

అభి బస్, మస్త్ అయింది, ఇక వీళ్ళ పప్పులు ఉడకవు. సమాజమే బలం దేశమే బలం ఐకమత్యమే మహాబలం!
జై హింద్

My Website: www.paree.in
My Email: www.paree.in@gmail.com

Watch the Full Video below.